అగ్నిపర్వత విస్ఫోటనం
భూమి లోపల విపరీతమైన వేడి మరియు పీడనం కారణంగా రాళ్ళు కరిగి మాగ్మా అనబడే వేడి ద్రవంగా మారతాయి. ఈ మాగ్మా తన చుట్టూ ఉన్న గట్టి రాళ్ల కంటే తేలికగా ఉండటం వల్ల, అది నెమ్మదిగా పైకి కదిలి భూమి పొరల కింద ఒక పెద్ద గది లాంటి ప్రదేశంలో పేరుకుపోతుంది వాటినే మాగ్మా చాంబర్ లు అంటారు.
ఈ మాగ్మాలో నీటి ఆవిరి మరియు కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులు కరిగి ఉంటాయి. కాలక్రమేణా, మాగ్మా చాంబర్‌లోకి మరింత మాగ్మా చేరడంతో లోపల పీడనం అంటే ప్రెజర్ విపరీతంగా పెరుగుతుంది. అధిక పీడనం తట్టుకోలేక, మాగ్మా భూమిలోని బలహీనమైన ప్రదేశాలు మరియు పగుళ్ల ద్వారా పైకి నెట్టబడుతుంది. అలా మాగ్మా భూమి ఉపరితలంపైకి శక్తివంతంగా బయటకు రావడాన్నే అగ్నిపర్వత విస్ఫోటనం అంటారు. బయటకు వచ్చిన తర్వాత మాగ్మాను లావా అని పిలుస్తారు. ఈ విస్ఫోటనంలో లావాతో పాటు బూడిద, పొగ, మరియు విష వాయువులు కూడా గాలిలోకి విడుదలవుతాయి.
మాగ్మా యొక్క రెండు ముఖ్య లక్షణాలు విస్ఫోటనాన్ని నిర్దేశిస్తాయి: మాగ్మా ఎంత చిక్కగా లేదా పలచగా ఉంది అనేది ముఖ్యం.
ఇది తేనెలా చిక్కగా ఉంటే దీనిలో వాయువులు (గ్యాస్‌లు) సులభంగా బయటకు వెళ్ళలేక లోపలే చిక్కుకుపోతాయి. చిక్కదనం వల్ల వాయువులు బయటకు వెళ్ళలేక లోపల విపరీతమైన పీడనాన్ని పెంచుతాయి. ఒకానొక దశలో ఈ పీడనం భూమి పొరలను చీల్చుకుని, భారీ శబ్దంతో పేలుతుంది.
పలచని మాగ్మా నీళ్ళలా పలచగా ఉంటుంది. దీని నుండి వాయువులు సులభంగా తప్పించుకుని బయటకు వెళ్లిపోతాయి. కాబట్టి పెద్దగా పీడనం ఏర్పడదు. అందువల్ల పెద్దగా శబ్దం రాకుండా లావా బయటకు వస్తుంది.
0 Comments